నిజామాబాద్, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా గుర్తించబడిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, ఇతర అన్ని ఏర్పాట్లను చక్కబెట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సిసి కెమెరాలతో పర్యవేక్షిస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, అభ్యర్థులు, ఏజెంట్లకు రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ఏజెంట్లు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రతి ఒక్కరికి నిర్దేశించిన మార్గాలను సూచిస్తూ అవసరమైన చోట్ల సూచిక బ్యానర్లు ఏర్పాటు చేయాలని, వారు ఆ మార్గాల మీదుగానే రాకపోకలు సాగించేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రతి కౌంటింగ్ హాల్ కు మెటల్ మెష్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాల్ లలో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, అగ్ని ప్రమాదాలు వంటి వాటికి ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పని చేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని తన వెంట ఉన్న ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు.
ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్, తదనంతరం చేపట్టే కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, అదనపు డీసీపీ జయరాం, నిజామాబాద్ ఏ.సీ.పీ కిరణ్ కుమార్, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ బి.నరేష్, శ్రీరాంకుమార్, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.