సాఫీగా ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం న్యూఢల్లీి నుంచి భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితేష్‌ వ్యాస్‌ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

పోలింగ్‌ నిర్వహణ కోసం చేపట్టిన చర్యల గురించి ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేశామని, ఓటింగ్‌ వివరాలతో కూడిన స్లిప్పులను సైతం ఇప్పటికే జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో సగటున 74 శాతం పంపిణీ పూర్తి చేశామని సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ దృష్టికి తెచ్చారు.

పోలింగ్‌ నిర్వహణ కోసం ఈవీఎం బ్యాలెట్‌, పోస్టల్‌ బ్యాలెట్‌, టెండర్‌ బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తయ్యిందని, కమిషనింగ్‌ ప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా ఈ.సీ.ఐ.ఎల్‌ ఇంజినీర్ల బృందాలు జిల్లాకు చేరుకున్నారని తెలిపారు. 80 ఏళ్ళు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యంగులు కలుపుకుని మొత్తం 2418 మంది ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు అర్హులుగా గుర్తించామని, వారి ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఓటును స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేక పోలింగ్‌ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు.

ఈ నెల 23, 24, 25 తేదీలలో ఈ బృందాలు ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామని, ఈ.సీ నిబంధనలకు అనుగుణంగా పూర్తి గోప్యత పాటిస్తూ ఓటు సేకరణ జరిపేలా గట్టి చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు ఇప్పటికే రెండు విడతలుగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి పోలింగ్‌ విధులపై పూర్తి అవగాహన కల్పించామన్నారు. శిక్షణ కేంద్రాల వద్దే ఫెసిలిటేషన్‌ సెంటర్‌ లను నెలకొల్పి పోలింగ్‌ విధుల్లో నియమించబడిన సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

పోలీసులు సహా ఇతర ఎన్నికల విధుల్లో నియమించబడిన సిబ్బంది కోసం రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను ఈ.సీ దృష్టికి తెచ్చేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చిన సీ.విజిల్‌ యాప్‌ గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ఆ యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. జిల్లా స్థాయిలోనూ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.

సువిధ పోర్టల్‌ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ గడువులోపు అనుమతులు జారీ చేస్తున్నామని అన్నారు. పోలింగ్‌ నిర్వహణ కోసం రిసీవింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను నెలకొల్పి పక్కాగా ఏర్పాట్లు చేశామని, జిల్లాకు కేటాయించబడిన జనరల్‌ అబ్జర్వర్లు ఇప్పటికే ఈ కేంద్రాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు.

కాగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఈ.సీ.ఐ సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితేష్‌ వ్యాస్‌ హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, సీ.పీ.ఓ బాబురావు, ఎన్‌.ఐ.సి అధికారి రవికుమార్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ప్రశాంత్‌, ఎన్నికల విభాగం సిబ్బంది పవన్‌, సాత్విక్‌, శ్రీనివాస్‌, రషీద్‌, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »