కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 30 న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓపిఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సాధారణ పరిశీలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయో తో కలిసి బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాస్టర్ ట్రైనీలచే ఫై,ఎపిఓ లకు నిర్వహిస్తున్న రెండవ విడత శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ తరగతుల్లో అన్ని అంశాలను అర్ధమయ్యే రీతిలో వివరించాలని మాస్టర్ ట్రైనర్లకు సూచించారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకుని పోలింగ్ విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని హితవు పలికారు.
ప్రధానంగా పోలింగ్ సమయంలో మిషన్‌లలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే సెక్టోరల్ అధికారి దృష్టికి తేవాలన్నారు. బ్యాలట్ యూనిట్ల సెట్టింగును తనిఖీ చేసుకోవాలన్నారు. యూనిట్ పోలింగ్‌కు ముందు ఏజెంట్‌ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి క్లియర్ బటన్ నొక్కాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం జాగ్రత్తగా పరిశీలించుకోవాలని,హ్యాండ్ బుక్ ను ఆకళింపు చేసుకొని తమ బృందంతో పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలన్నారు.
ఈ సందర్భంగా పీ.ఓలు, ఏ.పీ.ఓలకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం నియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను పరిశీలించారు.