ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌లో గోప్యత పాటీంచేలా పటిష్ట చర్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్హులుగా గుర్తించబడిన ఓటర్లకు సంబంధించి వారి ఇంటికే పోలింగ్‌ బృందాలు వెళ్లి ఓటు సేకరించే ప్రక్రియను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం జిల్లాలోని నిజామాబాద్‌ అర్భన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో ఇంటి నుంచి ఓటు స్వికరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఈ సదుపాయం ద్వారా తొలి రోజు అన్ని సెగ్మెంట్లలో కలుపుకుని మొత్తం 1058 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. ఇంకనూ మిగిలిఉన్న వారి ఓటును సేకరించేందుకు ప్రత్యేక పోలింగ్‌ బృందాలు ఈ నెల 24, 25 తేదీలలో దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. దివ్యాంగులకు, 80 ఏళ్ళు పైబడిన వృద్దులకు, కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారికి భారత ఎన్నికల కమిషన్‌ ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని గుర్తు చేశారు.

ఈ మేరకు జిల్లాలోని 6 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సమ్మతి తెలుపుతూ సీనియర్‌ సిటిజన్లు, దివ్యంగులు 2418 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వారి కోసం ప్రత్యేక ఎన్నికల బృందాలను ఏర్పాటు చేసి ఓటర్ల ఇంటి వద్దకు పంపించి ఓటును స్వికరిస్తున్నామని అన్నారు.

ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఓటరు పూర్తి గోప్యత పాటించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఇంటి నుంచి ఓటు స్వీకరించే షెడ్యూల్‌ వివరాలు పోటి చేసే అభ్యర్థులకు అందించామని, వారి ఏజెంట్‌లు సైతం బృందాల వెంట ఓటరు ఇంటి వద్దకు వెళ్తూ పారదర్శకంగా చేపడుతున్న ఈ ప్రక్రియను పరిశీలిస్తున్నారని అన్నారు.

ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు తాము ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నామనే విషయం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని, పోలింగ్‌ నిర్వహణకు వచ్చిన అధికారులకు, మన కుటుంబ సభ్యులకు కూడా చెప్పాల్సిన అవసరం లేదని, గోప్యతను పాటిస్తూ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చని, ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

పూర్తి గోప్యత ఉండే విధంగా ఇంట్లోనే సీక్రెట్‌ కంపార్టుమెంట్‌తో పాటు ఇతర అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బ్యాలెట్‌ పత్రాలతో ప్రిసైడిరగ్‌ అధికారి, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారి, వారి వెంట పోలీసు అధికారులతో కూడిన బృందాలు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్ళి ఓటర్ల నుంచి ఓటు స్వీకరిస్తున్నాయని అన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఇంటి వద్ద నుంచి ఓటును స్వీకరించే ప్రక్రియను పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్‌ చేస్తున్నామని తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »