నిజామాబాద్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు అదనపు కంట్రోల్ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ తరలింపు ప్రక్రియ నిర్వహించారు.
అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సప్లిమెంటరీ రాండమైజేషన్ జరిపారు. ఆ జాబితాను అనుసరిస్తూ కంట్రోల్ యూనిట్లను నియోజకవర్గాల బాధ్యులకు అప్పగించగా, పోలీసు బందోబస్తు నడుమ వాటిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ఈ.సీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా కంట్రోల్ యూనిట్లను తరలించారు.
వాస్తవానికి ఇప్పటికే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈవీఎంల తరలింపు పూర్తయ్యింది. అయితే పోలింగ్ సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తినా కూడా ఓటింగ్ కు అంతరాయం ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతో అదనపు కంట్రోల్ యూనిట్లను కేటాయించడం జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అదనపు ఈవీఎం లు సెక్టోరల్ అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని, ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే, నిమిషాల వ్యవధిలోనే సెక్టోరల్ అధికారులు సంబంధిత పోలింగ్ స్టేషన్ కు చేరుకుని తమ వద్ద రిజర్వ్ లో ఉండే ఈవీఎం ను కేటాయిస్తారని అన్నారు. ఈ ప్రక్రియలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, ఈడీఎం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.