కామారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని ప్రతి ఒక్కరు చదివి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పునరంకితమవుతామని అధికారులు సిబ్బందితో భారత సంవిధాన ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి పూర్వం వివిధ రాజుల కాలంలో ఒక్కో చట్టం ఉండేదని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రతి పౌరుడికి న్యాయం జరగాలని, అందరికి ఆమోద యోగ్యంగా రాజ్యాంగం లిఖించుకోవాలని కమిటీ ఏర్పాటు చేసి, అంబేద్కర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు ఎంతో శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించారని అన్నారు.
దేశంలో ఉన్న విభిన్న జాతులు, మతాలు, జీవన విధానం, జీవనశైలి ని దృష్టిలో పెట్టుకొని అందరికి సమన్యాయం చేయాలని ఉద్దేశ్యంతో రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడు సమాజంలో జీవించడానికి సమాన హక్కులు, భాద్యతలు కల్పించిందని, నేడు వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడి నడుస్తున్నదని, ప్రతి సమస్యకు జవాబు దొరుకుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగాని చదివి ఆకళింపు చేసుకోవాలని కోరారు.
బలమైన దేశంగా ఉండడానికి కారణం మన రాజ్యాంగమేనని, రాజ్యాంగం దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తున్నదని అన్నారు. మనమందరం సంతోషంగా జీవిస్తున్నామంటే రాజ్యాంగం చలవే అని, అట్టి రాజ్యాంగాని పరిరక్షిస్తూ భావితరాలకు మెరుగైన సమాజం అందించిటకు మనమంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కుల,మత తారతమ్యాలు లేకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని, ఈనెల 30 న జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని హితవు చెప్పారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.