కామారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ననుసరించి పోలింగ్ రోజు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం (సైలెన్స్ పీరియడ్ ) అత్యంత కీలకమని, అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోసిజర్ (ఎస్‌ఓపి) లో పేర్కొన్న విధంగా పోలింగ్‌కు 72 గంటలు, 48 గంటల ముందు పాటించవలసిన నిబంధనలను తు.చ. తప్పకుండ పాటించాలన్నారు.
30 వ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుండగా, అంతకు ముందు 48 గంటల నుంచి ఎన్నిక ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, ఐదుగురికి మించి ఒకే చోట గుమికూడరాదన్నారు. అక్రమ మద్యం తయారీపై ఆబ్కారీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని, స్వాధీనపరచుకున్న అక్రమ మద్యం వివరాలను ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారులకు తెలపాలన్నారు.
పోలింగ్ స్టేషన్ల సమీప ప్రాంతాలలో ఎటువంటి ప్రచారం చేయరాదని సూచించారు. ఎవరైనా ఆయుధాలు ధరించి వాహనాలలో సంచరించు వారిపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రచార సమయం ముగిసిన వెంటనే ఇతర నియోజక వర్గాలవారు వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు వాహనాలలో తరలించడం, ప్రలోభాలకు గురి చేయడం శిక్షార్హ నేరమని కలెక్టర్ స్పష్టం చేసారు.
ఓటు గోప్యత దృష్ట్యా మీడియా ఫోటోలు తీయరాదని సూచించారు. అవసరమైన ప్రాంతాలలో హోటళ్లులాడ్జింగులు, రెస్ట్ హౌసులు, గెస్ట్ హౌసులు, బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఫంక్షన్ హళ్ల్లు, ధార్మిక సంస్థలు తదితర ప్రాంతాలలో ఇతర నియోజక వర్గ ప్రాంతాల వారిని గుర్తించి పంపించాలని అధికారులను కోరారు. అదేవిధంగా జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను మరింత పటిష్టం చేసి తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు.