పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డిలతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి పాల్గొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాటు, ఈవిఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్‌ ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ జిల్లా కలెక్టర్‌ లకు పలు సూచనలు చేశారు.

వీడియో సమావేశం అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ, ఈ.సీ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేలా, ఆ సందేశం స్పష్టంగా తెలిసేలా మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి సదుపాయాలను సరిచూసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయం నవంబర్‌ 28 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్‌ పీరియడ్‌ పాటించాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్‌ అధికారులు సైలెన్స్‌ పీరియడ్‌లో పాటించాల్సిన నిబంధనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు సమాచారం అందించాలని, ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు తిరిగి వెళ్లేలా చూడాలని అన్నారు.

పోలింగ్‌ నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. పోలింగ్‌ అనంతరం పోలింగ్‌ కేంద్రాల నుంచి కౌంటింగ్‌ కేంద్రం స్ట్రాంగ్‌ రూమ్‌ కు ఈ.వి.ఎం. యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని, పోలీసు బందోబస్తు మధ్యన వాటిని తరలించాలని, సెక్టోరల్‌ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.

పోలింగ్‌ సిబ్బంది సకాలంలో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని, మాక్‌ పోల్‌ నిర్వహించాలని, పోలింగ్‌ సజావుగా జరిగే విధంగా విధులు నిర్వహించాలని, అవాంఛనీయ ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉన్న పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించాలని, జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరందు, రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »