నిజామాబాద్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి లేకుండా పోలింగ్ రోజున, అలాగే పోలింగ్ కు ఒక రోజు ముందు అనగా ఈ నెల 29 , 30 తేదీలలో ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఇతరులు ఎవరైనా సరే ముందస్తుగా ఎంసీఎంసీ ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ధ్రువీకరణ పొందాలని సూచించారు. లేనిపక్షంలో ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ తగు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 29, 30 తేదీలలో ప్రింట్ మీడియాలో (ఆయా పత్రికలలో) ఎన్నికల ప్రచార ప్రకనటలు ప్రచురితం చేయదలచిన వారు తప్పనిసరిగా ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే రీతిలో ఆవేశపూరితమైన, తప్పుదోవ పట్టించే, ద్వేషపూరిత ప్రకటనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబడదని స్పష్టం చేశారు.