నిజామాబాద్, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని ఎలక్షన్ కమిషన్ నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నవంబర్ 28 మంగళవారం సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
48 గంటల సైలెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, ఎంసిసి, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్లు తనిఖీ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెక్షన్ 126(1) (బి) ఆర్ పి యాక్ట్ 1951 ప్రకారం ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధమని కలెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ 28 సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేయించి, డ్రై డేగా ప్రకటించడం జరిగిందన్నారు.