కామారెడ్డి, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 30న రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలకు ఓటర్లు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటువేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటరుగా నమోదయిన ప్రతిఒక్కరు నైతిక బాధ్యతగా శతశాతం ఓటువేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై, విస్తృతంగా అవగాహన కల్పించామని, ఓటర్ కార్డులు, స్లిప్పులు లేకపోయినా ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని తీసుకువెళ్లి ఓటు వేయాలన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, నిర్ణీత సమయములో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అందరికి ఓటు వేసేందుకు అనుమతిస్తామన్నారు.
ఓటరు గుర్తింపు కార్డు నెంబరును టైపు చేసి 9211728082కు ఎస్‌ఎంఎస్ ద్వారా కానీ, నిరంతరం పనేచేసే హెల్ప్‌లైన్ 1950 నెంబరు ద్వారా కానీ, వెబ్సైట్ల ద్వారా, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐవోఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తమ పోలింగ్ కేంద్రం, బూత్ నెంబర్ తదితర వివరాలను తెలుసుకోవచ్చన్నారు.
ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఓటింగ్ ప్రక్రియకు కావలసిన సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించామన్నారు. ఈసారి పోలింగ్ సిబ్బంది ఆయా నియోజక వర్గాలకు చేర్చేందుకు, తిరిగి గమ్య స్థానాలు చేరేందుకు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.