కామారెడ్డి, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్ సిబ్బంది రెండవ విడత యాద్రుచ్చికరణ (ర్యాండమైజెషన్) ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరెట్‌లోని ఎన్.ఐ.సి హాల్‌లో కౌంటింగ్ పరిశీలకులు చిఫంగ్ ఆర్థుర్ వర్చుయో, జగదీశ్, అభయ్ నందకుమార్ కరగుట్కర్ సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ సెకండ్ ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు.
జిల్లాలోని మూడు శాసభసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ పూర్తయిన మీదట కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ.వీ.ఎంలను ఓట్ల లెక్కింపు కోసం కామారెడ్డిలోని ఎ. ఏం. సి. గోదాంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా కౌంటింగ్ కేంద్రాలకు తరలించి సాయుధ బలగాల పహారా నడుమ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 75, మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 54 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 62 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, రిజర్వు సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచామన్నారు.
వీరికి ఇప్పటికే పలు విడతలుగా మాస్టర్ ట్రైనర్స్ చే కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మలు పరిశీలించి పోలీసు సిబ్బందికి, కౌంటింగ్ సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ఆదేశాలకు కౌంటింగ్‌కు ఒక్కో టేబుల్‌కు ఒక్కో సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ సూపరవైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ చొప్పున ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపుకై 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తూ, 18 నుండి 20 రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి టేబుల్ వద్ద సిసికెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకై కామారెడ్డి నియోజక వర్గంలో 4 టేబుళ్ళు, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజక వర్గాలలో రెండు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భగా కౌంటింగ్ నిర్వహణపై ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పలు సూచనలు చేశారు.
కాగా, మూడవ విడత కౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 5.00 గంటలకు రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్టారని కలెక్టర్ తెలిపారు. ఆ జాబితాను అనుసరిస్తూ కౌంటింగ్ సిబ్బందిని ఆయా టేబుళ్లకు ఓట్ల లెక్కింపు కోసం కేటాయిస్తామని అన్నారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు మను చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, మన్నరు ప్రభాకెట్, సిపిఒ రాజారామ్, రఘునందన్, దయానంద్, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.