బాన్సువాడ, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తానని బిజెపి ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి 2600 ఓట్లు వచ్చాయని ఈసారి ఎన్నికల్లో ప్రజలు బిజెపి పార్టీపై విశ్వాసం ఉంచి 9 రెట్లు బలాన్ని అందించి ప్రజల పక్షాన పోరాటం చేయడంలో ముందుకు వెళ్లాలని ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానన్నారు.
ప్రజలు పెంచిన బలాన్ని పోరాటం చేయాలని ఆదేశించారని ప్రజల పక్షాన దోపిడీకి వ్యతిరేకంగా అవినీతి అక్రమాలను అడ్డుకునేందుకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉంటానన్నారు. అవినీతి అక్రమాలపై ఎక్కుపెట్టిన బాణంగా ప్రజల పక్షాన పని చేస్తానని ప్రజలు మార్పు కోరుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులై ఓట్లు వేశారని ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.
తాను పిసిసి అధ్యక్షుని ఓడగొడితే కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇద్దరు పార్టీ అధ్యక్షులను ఒకేసారి ఓడగోట్టి ప్రజల మద్దతు గెలిచారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్మూర్,కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ ప్రజలకు బిజెపి పార్టీని ఆదరించి గెలిపించినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బాన్సువాడలో ఓటమికి గల కారణాలను విశ్లేషించి కార్యకర్తలను నాయకులను మరింత బలోపేతం చేసి బాన్సువాడ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసే దిశగా పనిచేస్తామన్నారు.
ప్రజల సహకారం కార్యకర్తల పోరాటంతో భవిష్యత్తులో గెలుస్తామన్న ధీమా వచ్చిందన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుని నిబద్ధతగల కార్యకర్తలని పార్టీ ఏ ఆదేశం ఇచ్చిన తూచా తప్పకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొరబాబు, పట్టణ అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్, అసెంబ్లీ కో కన్వీనర్ భూపాల్ రెడ్డి స్వామి యాదవ్, బిజెపి నాయకులు చిదుర సాయిలు, అర్సపల్లి సాయి రెడ్డి, డాకయ్య, పైడిమల్ లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, హన్మండ్లు యాదవ్, సుధాకర్ గౌడ్, కోనాల గంగారెడ్డి, ముత్యాల సాయిబాబా,రాజాసింగ్, సాయికిరణ్, తుప్తి ప్రసాద్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.