డిచ్‌పల్లి, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాజ్యాంగ నిర్మాత , భారత దేశ ఆధునిక పితామహుడు , భారత రత్న డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎస్సీ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సిహెచ్. హారతి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ సిహెచ్ హారతి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ప్రపంచానికే ఆదర్శమని, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మూల స్తంభాలుగా రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు.
రాజ్యాంగం వలన దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కుల, మత, భేదం లేకుండా విద్య, వైద్య, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి చెందడానికి బాటలు వేసిందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అతిథిగా హాజరైన అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్.ఏ. పున్నయ్య మాట్లాడుతూ అంబేద్కర్ దార్శనికతతో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించారని అంబేద్కర్ దూరదృష్టతోనే ఈనాడు అనేకమంది దళిత ఆదివాసి గిరిజనులు మైనార్టీలు విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. ఒక దేవాలయం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పదని, గ్రంథాలయం దేశాన్ని మార్చే మహా వీరుల్ని సృష్టిస్తుందని అనేక గ్రంథాలయాలకు శంకుస్థాపన చేయించినారని పేర్కొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ఆచార్య.కే. రవీందర్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచ దేశాలలోనే గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశం కలిగి ఉన్నదని ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదిరించే శక్తి భారతదేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మావురపు సత్యనారాయణ, డాక్టర్ నందిని, డాక్టర్ నీలిమ, డాక్టర్ సంపత్, డాక్టర్ జమీల్, డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్ రాథోడ్, సూపరింటెండెంట్ ఉమారాణి, కేర్ టేకర్ సుధీర్ విద్యార్థులు పాల్గొన్నారు.