నిజామాబాద్, డిసెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది జిల్లా పాలనాధికారి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, గౌరవ వందనం సమర్పించారు. అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో పాటు కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమవంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్నారని, వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెళ్లదీస్తున్నామని అన్నారు.
సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ, వారి పట్ల, వారి సేవల పట్ల గౌరవభావంతో మెలగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారి రమేష్, కెప్టెన్ బాబురావు, సుబేదార్ రామేశ్వర్, మల్కిట్ సింగ్, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు మోహన్, దివాకర్ రెడ్డి, ఎన్ సీ సీ క్యాడెట్లు, సైనిక్ వెల్ఫేర్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు టి.వీరేశం ఆధ్వర్యంలో సైనికులను ఘనంగా సన్మానించారు.