నిజామాబాద్, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈసిఐఎల్ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల సందర్భంగా మాక్ పోలింగ్, పోలింగ్ సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివి ప్యాట్‌లను మరమ్మతుల కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు తరలించారు.
ఈవీఎంల తరలింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిలు ఈవీఎంల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ తెరిచి, సాంకేతిక సమస్యలు తలెత్తిన ఓటింగ్ యంత్రాలను ప్రత్యేక వాహనంలోకి చేర్చారు.
వాహనం హైదరాబాద్ వెళ్తున్న క్రమాన్ని సైతం జిపిఆర్‌ఎస్ ద్వారా పర్యవేక్షించారు. మార్గమధ్యంలో ఎక్కడ కూడా ఆగకుండా నేరుగా ఈసీఐఎల్ ఫ్యాక్టరీ కి ఈవీఎంలతో కూడిన వాహనం చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్, సంతోష్, జితేందర్ తదితరులు ఉన్నారు.