కామారెడ్డి, డిసెంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మహాలక్ష్మి పథకమును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మహాలక్ష్మి పథకంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలని సూచించారు. మహిళలకు రక్షణతో పాటు మహిళా సాధికారితను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారని తెలిపారు. మహిళలు, విద్యార్థులు, ట్రాన్స్ జెండర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. టిఎస్‌ఆర్టిసి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ సర్వీసులో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చని సూచించారు. కామారెడ్డి బస్టాండులో మహాలక్ష్మి పథకం కింద రెండు ఆర్టీసీ బస్సులలో మహిళలను ఎక్కించుకొని ఒకటి సదాశివ నగర్, మరొకటి తాడ్వాయి మండలం వరకు వెళ్లి తిరిగి కామారెడ్డి బస్టాండ్ కు రెండు బస్సులు వచ్చాయి.
ఆర్ టి సి బస్సులో మహిళలతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, ఆర్టీసీ డిఎం ఇంద్ర, అధికారులు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో కలెక్టర్, ఎస్పీ లతోపాటు మహిళలకు జీరో టికెట్ను ఆర్టీసీ అధికారులు అందించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారిని వాణి, డిపిఎం సుధాకర్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.