నిజామాబాద్, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం బోధన్ పట్టణంలోని ఆర్.కె ఇంజినీరింగ్ కళాశాలను పరిశీలించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం మార్గనిర్దేశం మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలను పరిశీలించేందుకు వీలుగా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్.కె కళాశాలను సందర్శించారు.
రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలన జరిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల కోసం అనువైన గదులను ప్రాథమికంగా పరిశీలించారు. తన వెంట ఉన్న అధికారులను, కళాశాల యాజమాన్యం ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో మరింత క్షుణ్ణంగా కళాశాల భవనాలను పరిశీలించి, సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ తహసీల్దార్ గంగాధర్ తదితరులు ఉన్నారు.