నిజామాబాద్, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
డిచ్పల్లిలోని సీ.ఎం.సీ కళాశాల, బోధన్ పట్టణంలోని ఆర్.కె ఇంజనీరింగ్ కాలేజీలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ లు సందర్శించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు అనువైన భవనాలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే కలెక్టర్ గురువారం బోధన్ లోని ఆర్.కె ఇంజనీరింగ్ కాలేజీని పరిశీలించిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిలతో కలిసి శుక్రవారం మరోమారు ఈ కళాశాలను సందర్శించారు. ఓట్ల లెక్కింపు, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌ల కోసం ఈ కళాశాల భవనంలో నెలకొని ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, వాటి గురించి సీ.పీ, అదనపు కలెక్టర్లతో చర్చించారు.
అంతకుముందు డిచ్పల్లిలోని సీ.ఎం.సీ కళాశాలను సందర్శించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ ల కోసం అందుబాటులో ఉన్న అనువైన గదులను పరిశీలించారు. ఇదివరకు 2014 జమిలి ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీ.ఎం.సీ కళాశాలలోనే నిర్వహించడం జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
అయితే సంవత్సరాల తరబడి నిరుపయోగంగా ఉన్నందున సీ.ఎం.సీ భవన సముదాయంలోని పలు గదులు నిర్వహణపరమైన లోపాలతో కూడుకుని ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వాటిని శుభ్రం చేయించి కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్‌లకు ఈ భవనం ఏమేరకు ఉపయోగపడుతుందో అన్ని విధాలుగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, బోధన్ తహసీల్దార్ గంగాధర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు ఉన్నారు.