కామరెడ్డి, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి బావయ్య అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు వివిధ క్రీడా పోటీల విజేతలకు శుక్రవారం బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి బావయ్య మాట్లాడారు. ప్రతి ఒక్కరులో ఏదో ఒక రకమైన విజ్ఞానం దాగి ఉంటుందని తెలిపారు. దివ్యాంగులు స్వయం ఉపాధి రంగాలు ఏర్పాటు చేసుకొని మరో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
క్రీడా పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులను ప్రధానం చేశారు. దివ్యాంగుల సంఘం ప్రతినిధులు మాట్లాడారు. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
అర్హత గల వారికి పరికరాలు ఇవ్వాలని సూచించారు. వివిధ రంగాల్లో రాణించిన దివ్యాంగులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా భవిత కేంద్రం సమన్వయకర్త శ్రీపతి, స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, ఐకెపిడీపీఎం రమేష్ బాబు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు బాల్ రెడ్డి, దుర్గ ప్రసాద్, పోచవ్వ, హరి సింగ్, ఈశ్వర్ పాల్గొన్నారు.