బాన్సువాడ, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ పిలుపుమేరకు బాన్సువాడ తపాలా శాఖ ఉద్యోగులు కార్యాలయం ముందు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలా ఉద్యోగులకు ఎనిమిది గంటల పని, పెన్షన్‌తో సహా అన్ని ప్రయోజనాలు కల్పించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
తపాల ఉద్యోగులకు టార్గెట్ల నుండి విముక్తి కల్పించి సేవలు వృద్ధి చేయడానికి కంప్యూటర్స్, ప్రింటర్స్, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అన్ని తపాల కార్యాలయాలకు ఇవ్వాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచి వేతనంతో కూడిన సెలవులను 30 రోజులకు పెంచాలని వారు డిమాండ్ చేశారు.
బిజినెస్ టార్గెట్ల పేరుతో జిడిఎస్ లను వేధించే అన్ని పద్ధతులను ఆపివేయాలని,జిడిఎస్ కు అతనితోపాటు కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అనే సూత్ర ప్రకారం వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్, సాయినాథ్, శ్రీనివాస్ రంగారావు, సాయిలు, కిషన్, గౌస్, రవి, మమత, శ్వేత, లక్ష్మి, డివిజన్లోని బిపిఎంలు తదితరులు పాల్గొన్నారు.