నిజామాబాద్, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ బడులలో మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ నిర్ణీత లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి శుక్రవారం ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
వివిధ జిల్లాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యలు, వాటి నిర్వహణ తీరుతెన్నుల గురించి ఆరా తీశారు. అక్షరాస్యత శాతం గణనీయంగా మెరుగుపడేలా బలమైన పునాది వేయడం, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం పట్ల ఆసక్తిని పెంపొందించేలా నాణ్యమైన విద్యను బోధించడం, విద్యాభివృద్ధిలో ప్రజాప్రతినిధులను, విద్యార్థులు తల్లిదండ్రులను భాగస్వాములు చేయాల్సిన ఆవశ్యకత గురించి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమీక్షలో నొక్కి చెప్పారు.
వెనుకబడిఉన్న అంశాలను ప్రస్తావిస్తూ, వాటి మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్దతులపై మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో, వారు సులభంగా ఆకళింపు చేసుకునే విధంగా పాఠ్యముశాలను బోధించేలా చూడాలని, బడుల నిర్వహణ తీరుతెన్నులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అప్పుడే విద్యా శాఖ ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు.
బడులలో అన్నిరకాల మౌలిక సదుపాయాలూ అందుబాటులో ఉండేలా చూడాలని, ఈ దిశగా ప్రభుత్వం సైతం కృషి చేస్తోందన్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జూమ్ మీటింగ్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.