కామారెడ్డి, డిసెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బూతు లెవల్ అధికారుల వద్ద సమగ్ర సమాచారం ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏఆర్‌ఓల మాస్టర్ ట్రేనర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
బూతు లెవెల్‌లో ఉన్న ఓటర్ల సంఖ్య, పురుషులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ ఎంతమంది ఉన్నారనే వివరాలు ఉండే విధంగా చూడాలని సూచించారు. 2024 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్ల నిండిన యువతీ, యువకులు బూతు లెవల్ అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాలో మృతి చెందిన వారి పేర్లు లేకుండా చూడాలన్నారు. ఓటర్ జాబితాలో ఒక వ్యక్తి పేరు రెండు చోట్ల ఉంటే వారి నుంచి డిక్లరేషన్ తీసుకొని ఒక పేరును తొలగించాలని తెలిపారు.
మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసి, ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారా, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారా, అనారోగ్యంతో మృతి చెందారా, సాధారణంగా మృతి చెందారా అనే వివరాలు పొందపరచి మృతి చెందిన వ్యక్తి పేరును జాబితా నుంచి తొలగించాలని చెప్పారు.
క్షేత్రస్థాయిలో బిఎల్వోలు రిజిస్టర్ ఏర్పాటు చేసుకొని వాటిలో సమగ్ర వివరాలు రాసుకునే విధంగా ఏఆర్వోలు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎన్నారైలు 6 (ఎ) లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు ఫారానికి పాస్పోర్ట్ జతచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రేనర్స్ హిమ బిందు, శివ ప్రసాద్ ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణలో ఎన్నికల సూపరిండెంట్ ప్రేమ్ కుమార్, ఎన్నికల విభాగం అధికారులు అనిల్ కుమార్, నరేందర్ పాల్గొన్నారు.