నిజామాబాద్, డిసెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలో అద్భుత ప్రతిభను చాటిన నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర) విద్యార్ధి అమర్ సింగ్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందించారు. హెచ్.ఈ.సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమర్ సింగ్ ఇటీవల జరిగిన ఇండో-నేపాల్ ఇంటర్నేషనల్ రూరల్ గేమ్స్ – 2023 (ఆర్.జీ.ఎఫ్.ఏ) క్రీడా పోటీల్లో కబడ్డీ విభాగంలో పాల్గొన్నాడు.
అద్భుత ప్రతిభను కనబరుస్తూ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించి మొదటి బహుమతి కింద బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్ నేతృత్వంలో సదరు విద్యార్ధి ఐ.డీ.ఓ.సీలో జిల్లా పాలనాధికారిని కలిశాడు.
అమర్ సింగ్ ను కలెక్టర్ అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ప్రతిభను చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. సదరు విద్యార్థికి డీ.ఐ.ఈ.ఓ రఘురాజ్ నగదు ప్రోత్సాహకం అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎం.ఎస్.వి.ప్రసాద్, శివవ్యా, అమర్ సింగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.