మానవ చలనశీలతపై చర్చ
వాతావరణ మార్పులు – వలసలు, మానవ చలనశీలతపై ప్రభావం అనే అంశంపై అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సోమవారం జగిత్యాలలో చర్చా సమావేశం నిర్వహించింది. వాతావరణ మార్పుల వలన గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వలస కార్మికుల ఆరోగ్యంపై, పని ప్రదేశాల్లో పరిస్థితులపై ఎలాంటి ప్రభావం కలుగుతున్నది అనే విషయంపై చర్చ జరిగింది.
భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, అకాల వర్షాలు, వరదలు, కరువు లాంటి ప్రకృతి వైపరీత్యాల వలన భారత్‌లో ప్రజల జీవనోపాధికి ముప్పు ఏర్పడి అంతర్గత, అంతర్జాతీయ వలసలకు దారి తీస్తున్నదని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి అన్నారు. అధిక వేడి వలన మధ్యప్రాచ్య గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలస కార్మికుల ఆరోగ్యంపై, ఉపాధిపై ప్రభావం చూపుతున్నదని ఆయన అన్నారు. తీవ్రమైన వాతావరణ మార్పుల వలన ఇటు భారత దేశంలో అటు గల్ఫ్ దేశాలలో వలస వెళ్లే కార్మికుల జీవితాలపై ప్రభావం కలిగిస్తున్నదని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి అన్నారు.
గ్లోబల్ ఫోరం ఆన్ మైగ్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ – జిఎఫ్‌ఎండి (వలసలు మరియు అభివృద్ధి పై ప్రపంచ వేదిక) అనేది దేశాల నేతృత్వంలోని అనధికారిక, కట్టుబడని అంతర్-ప్రభుత్వ ప్రక్రియ. 2024 లో జరుగబోయే జిఎఫ్‌ఎండి సదస్సులో ‘మానవ చలనశీలతపై వాతావరణ మార్పుల ప్రభావం’ అనే అంశంపై చర్చ జరుగనున్నదని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు.
తమ గ్రామంలో వందలాది కోతులు పంటలు నాశనం చేస్తున్నాయని కొడిమ్యాల మండలానికి చెందిన గల్ఫ్ రిటనీ రైతు చల్ల లక్ష్మారెడ్డి వాపోయారు. గల్ఫ్ కార్మికులు వృత్తి సంబంధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గల్ఫ్ కార్మిక నాయకుడు షేక్ చాంద్ పాషా అన్నారు. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలలో గల్ఫ్ రిటనీలు ఉపాధి పొందే మార్గాలను వ్యవసాయ నిపుణుడు గొల్లపల్లి రత్నాకర్ వివరించారు.
న్యాయవాదులు గుయ్య సాయికృష్ణ యాదవ్, దీకొండ కిరణ్, గల్ఫ్ వలసలపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాగరాజు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.