ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికి తీసిపోరని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకను నిర్వహించారు.

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, అర్బన్‌ శాసన సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆయా రంగాల్లో దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ప్రతిభా పాటవాలను గుర్తు చేస్తూ వారిని కొనియాడారు. విద్యా, రాజకీయ రంగాలతో పాటు క్రీడలు, ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏ రంగంలో చూసినా దివ్యాంగులు సమాజంలోని సకలాంగులకు ఎంతమాత్రం తీసిపోకుండా తమ ప్రతిభను చాటుకుంటున్నారని, పైపెచ్చు కొంతమంది నైపుణ్యాల ప్రదర్శనలో ఒకింత ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు.

ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ, మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, తద్వారా అనేక అద్భుతాలు ఆవిష్కరించాలని ఆకాంక్షించారు. శారీరక లోపం విజయ సాధనకు ఎంతమాత్రం అడ్డంకి కాదని, మానసిక దృఢత్వంతో ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మల్చుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రంగాల్లో దివ్యాంగులకు చేయూతను అందిస్తున్నాయని, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.

ఎలక్షన్‌ కమిషన్‌ సైతం ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా దివ్యాంగుల కోసం పోలింగ్‌ కేంద్రాలలో వీల్‌ ఛైర్స్‌, ర్యాంపులు, ప్రత్యేక బ్యాలెట్‌ పేపర్లు వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచిందని గుర్తు చేశారు.

సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత దక్కేలా జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తామని కలెక్టర్‌ భరోసా కల్పించారు. దివ్యాంగులకు ఉద్దేశించిన పథకాలు, వారి హక్కుల గురించి విరివిగా ప్రచారం చేసేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఆయా శాఖల్లో ఖాళీల భర్తీ కోసం చేపట్టే ఉద్యోగ నియామకాల్లోనూ దివ్యాంగులకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేక నోటిఫికేషన్‌ వెలువరించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు చేసిన అభ్యర్థనపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన సదరం సర్టిఫికెట్ల జారీ కోసం స్లాట్ల సంఖ్యను పెంచుతామన్నారు. దివ్యాంగులు ఎంతమాత్రం అధైర్య పడవద్దని, ప్రభుత్వ యంత్రాంగం వారికి వెన్నుదన్నుగా ఉంటుందని కలెక్టర్‌ భరోసా కల్పించారు.

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, దివ్యాంగులకు అండగా ఉంటానని అన్నారు. వారికి మౌలిక వసతులు, విద్య, వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా, ప్రతిఒక్కరు వారికి చేయుతగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులను శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు బహూకరించారు. అలాగే దివ్యాంగులకు సేవలందిస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలపించిన గేయాలు ఆహుతులను అలరింపజేశాయి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు సూదం లక్ష్మి, డీఆర్డీఓ చందర్‌, డీడబ్ల్యూఓ రసూల్‌ బీ, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »