కామారెడ్డి, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని విధాలుగాసిద్ధంగా ఉండవలసినదిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా నిర్వహణపరమైన ఏర్పాట్లపై దృష్టిని కేంద్రీకరించాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన 9 అంశాలతో కూడిన వివరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా పక్కాగా ఉండాలని, మార్పులు, చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలిస్తూ పెండిరగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ఓటరు జాబితాలో ఇంకనూ ఎక్కడైనా చిరునామాలు, అస్పష్టమైన ఫోటోలు ఉన్నట్లయితే అలాంటి వాటిని సవరించాలని సూచించగా పెండిరగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సీఈఓ దృష్టికి తెచ్చారు.
నియోజకవర్గాల వారీగా ప్రతిరోజూ రిటర్నిగ్ అధికారులతో సమీక్షిస్తున్నానని, త్వరలో అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. జనవరి 6, 2024న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేసి, జనవరి 22, 2024 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, ఫిబ్రవరి 2, 2024 లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, ఫిబ్రవరి 8, 2024న తుది ఓటరు జాబితా రూపొందించేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నామని కలెక్టర్ తెలిపారు. అంతేగాక ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని గుర్తిస్తున్నామన్నారు.
పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పుల విషయమై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ తుది ఓటరు జాబితాను రూపొందిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలను ఖరారు చేయాలని, నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, భద్రతాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వికాస్ రాజ్ సూచించాగా అందుకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్. తెలిపారు అదేవిధంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ నివేదికలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపుకలెక్టర్ మను చౌదరి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరిండెంట్ అనిల్ కుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.