పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ వారీగా నిర్వహణపరమైన ఏర్పాట్లపై దృష్టిని కేంద్రీకరించాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన అంశాలతో కూడిన వివరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితా పక్కాగా ఉండాలని, మార్పులు, చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండిరగ్‌ లో పెట్టకూడదని సూచించారు. ఓటరు జాబితాలో ఇంకనూ ఎక్కడైనా చిరునామాలు, అస్పష్టమైన ఫోటోలు ఉన్నట్లయితే జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అలాంటి వాటిని సవరించాలని అన్నారు.

ఈ విషయమై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పందిస్తూ, పెండిరగ్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని సీఈఓ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల వారీగా ప్రతిరోజూ తాను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులతో సమీక్షిస్తున్నానని, ఈ నెల 25 వ తేదీ లోపు అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. జనవరి 6, 2024న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేసి, జనవరి 22, 2024 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, ఫిబ్రవరి 2, 2024 లోగా అభ్యంతరాలను, ఓటర్‌ క్లెయిమ్స్‌ ను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, ఫిబ్రవరి 8, 2024న తుది ఓటరు జాబితా రూపొందించేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నామని కలెక్టర్‌ అన్నారు.

కాగా, ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని తక్షణమే గుర్తిస్తూ, పోలింగ్‌ కేంద్రాల పునర్‌ వ్యవస్థీకరణ చేయాలని సీ.ఈ.ఓ సూచించారు. పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పుల విషయమై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించాలని, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ రూపొందించిన తుది జాబితాను తమకు పంపించాలన్నారు. 2024 జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారందరు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా విస్తృత చర్యలు చేపట్టాలని అన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంలను ఖరారు చేయాలని, నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, భద్రతాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తూ, నివేదికలు సమర్పించాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరందు, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు రాజేంద్ర కుమార్‌, వినోద్‌ కుమార్‌, రాజాగౌడ్‌, భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్‌ పలు సూచనలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »