నిజామాబాద్, డిసెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
యాసంగి పంటల సాగుకు సంబంధించి జిల్లాలోని రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు జిల్లా మార్కెఫెడ్ వద్ద అందుబాటులో ఉన్నాయని జిల్లా సహకార అధికారి సింహాచలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు.
మార్కెఫెడ్ కు ముందుగానే డబ్బులు చెల్లించి జిల్లాలోని అన్ని సహకార సంఘాలలో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిలువలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లాలో గల అన్ని సహకార సంఘాల కార్యదర్శులను ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని డీసీఓ తెలిపారు. రైతులకు ఎరువులు అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను రోజు వారీ మార్కెఫెడ్ ఖాతాలో జమచేస్తూ, రైతులకు నిరంతరాయముగా ఎరువులు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్ని సహకార సంఘాల కార్యదర్శులను ఆదేశించడం జరిగిందన్నారు.
ఏదైనా సహకార సంఘములో రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచలేదని, ఎరువుల కొరత ఉన్నదని తెలిసినచో ఆ సంఘ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులందరూ సహకార సంఘాలలో తమ అవసరాలకు సరిపడా యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు డబ్బులు చెల్లించి తీసుకోవలసిందిగా డీసీఓ విజ్ఞప్తి చేశారు. రైతులకు నిర్ణీత ధర కంటే ఎక్కువకు ఎరువులు అమ్మినట్లు తెలిసినచో సంబంధిత సొసైటీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఓ స్పష్టం చేశారు.