నిజామాబాద్, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అర్హులైన వారందరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని పక్కాగా ఓటరు జాబితా రూపకల్పన కోసం తోడ్పాటును అందించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమై ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
2024 జనవరి 01 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారందరు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. జనవరి 6న డ్రాప్ట్ రోల్ పబ్లిష్ అవుతుందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు దీనిని క్షుణ్ణంగా పరిశీలించి, జాబితాలో ఎలాంటి తప్పులు ఉన్నా తమ దృష్టికి తేవాలని సూచించారు. ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు ఉంటే ప్రజలు సైతం ఫారం-8 ద్వారా బూత్ లెవెల్ అధికారికి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. మృతిచెందిన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితాలో ఉంటే, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని వాటిని తొలగించాలని చెప్పారు.
రెండు చోట్ల ఒక వ్యక్తికి ఓటు ఉంటే వాటిలో ఒక దానిని తొలగించుకునే విధంగా చూడాలన్నారు. డ్రాఫ్ట్ రోల్ పై జనవరి 22 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, వాటిని పరిష్కరించిన మీదట 2024 ఫిబ్రవరి 08 న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. కాగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ కోసం రూపొందించిన ప్రతిపాదనల గురించి కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు మూడు కిలోమీటర్ల దూరం ఉన్నట్లయితే, అలాంటి వాటి గురించి అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రూపొందించిందన్నారు.
నియోజకవర్గాల వారీగా మార్పులు చేయవలసిన పోలింగ్ కేంద్రాలపై చర్చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.