ఎల్లారెడ్డి, డిసెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో శనివారం డివిజనల్ స్థాయి, మండల స్థాయి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ… ప్రజాసేవకు అందరూ కలిసి రావాలని సూచించారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా అధికారులు పనిచేయాలని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పారదర్శకమైన పాలనను అందిస్తుందని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చాని పేర్కొన్నారు. ప్రతి మండల కేంద్రంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను మండల స్థాయిలో తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
రోడ్లు, భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు తనకు తెలియజేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. గ్రామస్థాయి సమస్యలను మండల స్థాయిలో అధికారులు పరిష్కారం చేయాలని తెలిపారు. విద్య, వైద్యం, రోడ్లు భవనాలు, నీటిపారుదల, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, సర్వే ల్యాండ్ రికార్డ్, రెవెన్యూ శాఖల వారిగా నిర్వహించారు. సమావేశంలో ఆర్డిఓ ప్రభాకర్, జిల్లాస్థాయి అధికారులు సాయన్న, రాజారాం, దయానంద్, మురళి, రాజు, శ్రీనివాస్, రజిత తదితరులు పాల్గొన్నారు.