ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, ఆరు గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకై ప్రభుత్వం ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు అమలు చేయనున్న ప్రజా పాలన కార్యక్రమంపై నిజామాబాద్‌ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖా మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజా పాలన కార్యక్రమం అమలు తీరుపై ఉభయ జిల్లాల అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దశాబ్దాల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, కష్టాలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను తీర్చి, బడుగు, బలహీన వర్గాల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిందన్నారు. అధికారులు ఏదో మొక్కుబడిగా కాకుండా జవాబుదారీతనంతో అత్యంత పారదర్శంకంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని హితవు పలికారు.

ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించి, ఆ వివరాలను ఆన్‌ లైన్‌ లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతీ పేదవాడికి తప్పనిసరి న్యాయం జరగాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి అర్హులైన ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా చూడాలని, ప్రజాపాలన కార్యక్రమం గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజలందరికి అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, అవగాహన కల్పించేలా ప్రజాప్రతినిధులు, మీడియా, సోషల్‌ మీడియాలో యువత కూడా తమవంతు చొరవ చూపాలన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఎటువంటి ఫిర్యాదులు, అవకతవకలకు తావు లేకుండా ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సంపూర్ణ సమాచారాన్ని సేకరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, తద్వారా అర్హులకు సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి జూపల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో తొక్కిసలాటలు, రద్దీ వంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్‌ శాఖ కూడా సంపూర్ణ భాగస్వామ్యం అయి, ప్రజా పాలన కార్యక్రమాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సానుకూల దృక్పథంతో, ప్రజలను సంతృప్తిపరిచే రీతిలో ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు. ఈ సందర్భంగా ప్రజా పాలన అమలు కోసం చేపట్టిన చర్యల గురించి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, మనూ చౌదరిలు మంత్రి దృష్టికి తెచ్చారు.

సమావేశంలో రాజ్యసభ సభ్యులు కేఆర్‌.సురేష్‌ రెడ్డి, నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌, నిజామాబాద్‌ జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూ కిరణ్‌, ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు పి.సుదర్శన్‌ రెడ్డి, ఆర్‌.భూపతి రెడ్డి, పైడి రాకేష్‌ రెడ్డి, ధన్‌ పాల్‌ సూర్యనారాయణ, వెంకట రమణా రెడ్డి, కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, నిజామాబాద్‌ అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, కామారెడ్డి అదనపు కలెక్టర్‌ మనూ చౌదరి, నిజామాబాద్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌, ఉభయ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »