దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలో, 80 మున్సిపల్‌ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి నియోజక వర్గ స్థాయి అధికారులులకు, మండల ప్రత్యేకాధికారులు సూచించారు.

ప్రజాపాలన గ్రామ,వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌ లో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. అర్హులైన/నిజమైన లబ్దిదారులకు దశలవారీగా, నిర్ణేత కాలవ్యవధిలో సామాజిక భద్రతా కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందన్నారు.

అందులో భాగంగా డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు (8) పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆయన తెలిపారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ దరఖాస్తులు స్వీకరించాలని, ప్రజా పాలన నిర్వహణపై ప్రభుత్వ సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలని అన్నారు. ప్రతి మండలం పరిధిలో తహసిల్దార్‌, ఎంపీడీవో ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ఆ బృందాలు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు గ్రామా పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.

షెడ్యూల్‌ ప్రకారం గ్రామాలు, వార్డులకు వెళ్లాలని, ప్రజాపాలన నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని చెప్పారు. మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు సభలు నిర్వహించు ప్రాంతాలలో ఒకరోజు ముందుగానే అందించాలని, గ్రామసభ నిర్వహణపై డప్పు చాటింపు ద్వారా ప్రచారం చేయాలని తద్వారా దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వస్తారని అన్నారు.

గ్రామంలోని నిరక్షరాస్యులకు దరఖాస్తు నింపడంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు సహకరించేలా చూడాలని మనుచౌదరి తెలిపారు. సభ నిర్వహణకు షామియానా, త్రాగునీరు, కుర్చీలు, అవసరమైన బల్లలు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని, దరఖాస్తుల వెంట ఆధార్‌, రేషన్‌ కార్డు జత చేసేలా చూడాలని అన్నారు.

అట్టి దరఖాస్తులను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయాలని, దరఖాస్తుదారునికి రసీదు అందించాలని, ప్రజాపాలన సభ నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామసభల కౌంటర్ల వద్ద క్యూలైన్‌ విధానం పాటించేలా చూడాలని, అవసరమైన మేర పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »