నిజామాబాద్, డిసెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉత్తరప్రదేశ్ లోని ఇటావాకు చెందిన సామాజిక కార్యకర్త రాబిన్ సింగ్ పిలుపునిచ్చారు. నానాటికీ కలుషితమవుతున్న పర్యావరణం ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటుతూ, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాబిన్ సింగ్ దేశ వ్యాప్తంగా సుదీర్ఘ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సైకిల్ యాత్ర ద్వారా రాబిన్ సింగ్ గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నానాటికి పర్యావరణం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతింటోందని, పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయని, ఈ పరిణామం ప్రాణకోటి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించిందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ, ఆ దిశగా అంకితభావంతో కృషి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిరదన్నారు.
రైతులు సేంద్రియ ఎరువులు వాడే విధంగా చూడాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా వీడాలని పిలుపునిచ్చారు. బాటిళ్లులో నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిరదని గుర్తు చేస్తూ, మొక్కలు నాటి ప్రాణవాయువును పెంచుకోవాలని సూచించారు.
ఈ సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలలో ముఖ్యంగా యువత, విద్యార్థులలో అవగాహన పెంపొందించేందుకు తాను 2022 అక్టోబర్ 06న కన్యాకుమారి నుండి సైకిల్ యాత్ర చేపట్టానని రాబిన్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, అసోం, మేఘాలయ, బీహార్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢల్లీి, గోవా తదితర ప్రాంతాల మీదుగా 448 రోజులలో 26వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తి చేశానని వివరించారు. ఛత్తీస్ గఢ్ మీదుగా భోపాల్ వరకు తన యాత్ర కొనసాగుతుందన్నారు.