కామారెడ్డి, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులను అభినందిస్తూ వాటిని వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు అందజేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి పాల్గొన్నజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుటలో అధికారుల సేవలు ప్రశంసనీయమని అన్నారు.
త్వరలో రాబోయే పార్లమెంటు ఎన్నికలు కూడా సజావుగా నిర్వహించుటలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. అదేవిధంగా నూతన సంవత్సరంలో జిల్లా అన్ని రంగాలలో మరింత పురోభివృద్ధి సాధించుటలో తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. అర్హులైన పేదలకు అభయ హస్తం ఆరు గ్యారంటీలు అందించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని, తమ శాఖల అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయికి చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.
జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు మరింత విస్తరించడానికి సంస్థలో ప్రతి అధికారి సభ్యత్వం తీసుకోవాలని అన్నారు. జిల్లాలో రక్తనిధి కొరత వల్ల చాలా ఇబ్బంది పడవలసి వస్తున్నదని, గర్భిణీ స్త్రీలు, ప్రమాదాలబారిన పడుతున్న వారికి సుమారు నెలకు వంద యూనిట్లకు పైగా రక్తం అవసరమవుతున్నదని అన్నారు.
రక్తదానం చేస్తే మరో ప్రాణాన్ని కాపాడవచ్చని, వివిధ శాఖల ఉద్యోగులు ప్రతి నెల రక్తదానం చేసేలా క్యాలెండర్ రూపొందించుటకు త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు సయాన్న, సాయగౌడ్, రాజారామ్, యాదవ్, భాగ్యలక్ష్మి, దయానంద్, సాయిబాబ, సింహరావు, సురేందర్ కుమార్, బావయ్య, రాజు, శ్రీధర్, మల్లికార్జున్ బాబు, శ్రీనివాస్, భార్గవ్, వరదా రెడ్డి, దామోదర్ రెడ్డి, రాజన్న తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.