నిజామాబాద్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వంద శాతం లబ్దిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ తెలిపారు.
బుధవారం నిజామాబాద్ పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ మాట్లాడుతూ… .కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వంద శాతం లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. అర్హులై సంక్షేమ పథకాలు లబ్ధి పొందని వారు ఉండకూడదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.
క్యాలెండర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను సెల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మీకు తెలిసిపోతాయని, ఆ సదుపాయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పట్టణ మరియు గ్రామగ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు
వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని వికసిత్ భారత్ సంకల్పయాత్ర జిల్లా నోడల్ అధికారి మరియు ఎల్ డిఎం యు.నాగ శ్రీనివాసరావ్ అన్నారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభవాలను, అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. అర్హులైన లబ్ధిదారులు అందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని, అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా మీ ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
అనంతరం ముద్ర, పీఎం స్వానిది రుణాలకు సంబంధించి శాంక్షన్ లెటర్లను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు స్థానికులతో వికసిత్ భారత్ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలు, గోడప్రతులు, క్యాలెండర్లను ఆవిష్కరించి, ప్రజలకు పంపిణీ చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు.
కార్యక్రమంలో ఎన్ వైకె డిస్ట్రిక్ కోఆర్డినేటర్ శైలి బెల్లాల్, బిజెపి జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ అరవింద్ కుమార్ రవి, బిజెపి డిప్యూటీ ఫోర్ లీడర్ ఎన్ రాజు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.