నిజామాబాద్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి సూచించారు. డిచ్పల్లి మండలం దూస్ గాంలో బుధవారం కొనసాగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తెస్తూ, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. గత నెల 28 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఇంకనూ మిగిలిఉన్న అర్హులైన కుటుంబాలు ఈ నెల 06 తేదీ వరకు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తులు అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పనిసరిగా లబ్ది చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా పాలన నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించిన అదనపు కలెక్టర్లు
జిల్లాలో కొనసాగుతున్న ప్రజా పాలన సభల నిర్వహణ తీరుతెన్నులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు అనునిత్యం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా రెంజల్ మండలం సాటాపూర్, ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామాలలో జరిగిన ప్రజా పాలన సభలను పరిశీలించారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.యాదిరెడ్డి సిరికొండ మండలంలోని తాటిపల్లి, చిరంపల్లి తదితర గ్రామాలలో జరిగిన ప్రజాపాలన సభలను సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలన జరిపారు. సభలకు వచ్చే వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, సరిపడా దరఖాస్తుఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వీరి వెంట జెడ్పి సి.ఈ.ఓ గోవింద్, డీఆర్డీఓ చందర్ తదితరులు ఉన్నారు.