నిజామాబాద్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా ప్రజలు అందిస్తున్న దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరుతెన్నులను, రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు.
ప్రజలకు దరఖాస్తుఫారాలు అందుబాటులో ఉంచారా అని ఆరా తీశారు. దరఖాస్తులు పూరించేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లు, దరఖాస్తుల స్వీకరిస్తున్న కౌంటర్ల వద్దకు వెళ్లి అధికారులు స్వీకరించిన అప్లికేషన్లను స్వయంగా పరిశీలించారు. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రసీదు అందించాలని, ప్రజలు సమర్పించే అన్ని దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులను వెంటదివెంట రోజువారీగా ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేయాలని, దరఖాస్తులను ఆయా మండలాల ఎంపిడిఓ కార్యాలయాలలో భద్రపరచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వివరాలను ఆన్‌లైన్‌లో కంప్యూటరీకరించే సమయంలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత మండల స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ అధికారులు ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరపాలని సూచించారు. నిర్దేశిత గడువులోపు దరఖాస్తు వివరాల నమోదు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నోడల్ అధికారి తిరుమల ప్రసాద్, మండల ప్రత్యేకాధికారి, తదితరులున్నారు.