కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహనీయుడు, విద్యావేత్త లూయిస్ బ్రెయిలీ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 215 వ జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల దినోత్సవ వేడుకలలో కలెక్టర్ మాట్లాడుతూ ఇష్టపడి చదివి సమాజంలో మంచి గుర్తింపును పొందాలని అన్నారు.
అంధులు ఆత్మవిశ్వాసంతో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని అభిలషించారు. కళ్ళు లేవని అంధులు అధైర్యపడవద్దని బ్రెయిలీ లీపి ద్వారా చదువు నేర్చుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. ప్రజా పాలన దరఖాస్తులను అధికారులు దివ్యాంగుల ఇంటి వద్దకు వెళ్లి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దివ్యాంగులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఇంకా కావలసిన సౌకర్యాలను కల్పించుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంధుల కోసం ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పై బ్రెయిలీ లిపిని రాయించినట్లు తెలిపారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లూయిస్ బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షల ను అంధులకు తెలిపారు. ఈ సంధర్బంగా బ్రెయిలీ లిపి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
జిల్లా స్త్రీ శిశు సంక్షేమం, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య మాట్లాడుతూ.. అంధులు పట్టుదలతో ఇష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని తెలిపారు. దివ్యాంగులు భవిత కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, జాతీయ అంధుల సంఘం అధ్యక్షుడు హరి సింగ్, భవిత కోఆర్డినేటర్ శ్రీపతి, సుదర ఫౌండేషన్ ప్రతినిధి సుజాత రెడ్డి, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పోశవ్వ, బిక్ష నాయక్, రవీందర్, దుర్గాప్రసాద్, ఐసిడిఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.