కామారెడ్డి, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒకరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్డు భద్రత పై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరు వైకల్యం బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా, రహదారి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల వివరాలు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్లపై కె.జి. వీల్స్ తిరగకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించడానికి జాతీయ రహదారి ప్రక్కల ఉన్న గ్రామాలలో పొలిసు కళా బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పొలిసు అధికారులకు సూచించారు.
ఫస్ట్ రెస్పాండర్‌గా ఉండేందుకు జాతీయ రహదారులప్రక్కల ఉండే పెట్రోల్ బంకులు, డాబాలలో పనిచేసే వారికి, యువతకు, ప్రథమ చికిత్సవ, సి.పి.ఆర్. పై అవగాహన కలిగించాలన్నారు. జిల్లా పరిధీలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించడం జరిగిందని, ఆయా ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని చెప్పారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపవద్దని సూచించారు. అటవీ ప్రాంతం ఉన్న ప్రాంతాల్లో నెమ్మదిగా వెళ్లేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఓవర్ లోడిరగ్ వాహనాలపై తగు చర్యలు తీసుకోవలసిందిగా రవాణా శాఖాదికారికి సూచించారు. సమావేశంలో జాతీయ ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.ఎస్.రావ్, డిఎస్పీ ప్రకాష్, ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఈ ఈ శ్రీనివాస్, ఆర్.టి.ఓ. వాణి , డిఎమ్ అండ్ హెచ్‌ఓ లక్ష్మణ్ సింగ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ మురళి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.