నిజామాబాద్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ అర్బన్‌లో ఆరు గ్యారంటీ దరఖాస్తు స్వీకరణను మాజీ మంత్రి, నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్ మహమ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వం అని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు.
ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హత ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గత పాలకుల మాదిరి మా పార్టీలోకి వస్తేనే ఇల్లు, పెన్షన్ ఇస్తామనే అంత దరిద్రపు ఆలోచనలు తమకు లేవని, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చే పథకాలు అమలు కాకుండా ఉంటే బాగుండని బీఆర్‌ఎస్ పగటి కలలు కంటుందని, తొమ్మిదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వని ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం లాక్కుందని, ప్రతీ డివిజన్ లో కౌంటర్ ఉంటుందని, జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు.
అవసరం అయితే దీన్ని ఇంకా పొడిగిస్తాం లేదా నిరంతర ప్రక్రియగా చేస్తామన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో ఇప్పటివరకు ఒక లక్ష దరఖాస్తు ఫారాలు అందించామని,
అందులో శుక్రవారం వరకు 86వేల దరఖాస్తులు స్వీకరించబడ్డాయి అన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.