కామారెడ్డి, మే 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సహకార సంఘాల అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లో సహకార సంఘాల అధికారులతో దాన్యం నిలువలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న దాన్యం బస్తాలను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు లారీల ద్వారా తీసుకువచ్చి రైస్ మిల్లులలో దింపే విధంగా సివిల్ సప్లై ఉప తాసిల్దార్లు చూడాలని తెలిపారు.
అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు ఉంచవద్దని సూచించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు లారీలను కేంద్రాలకు పంపి దాన్యమును ఎప్పటికప్పుడు రైస్మిల్లకు పంపించాలని కోరారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, ఇంచార్జ్ పౌరసరఫరాల మేనేజర్ నిత్యానందం, సహకార సంఘాల అధికారులు పాల్గొన్నారు.