కామారెడ్డి, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన కనీస మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాల పై జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌లతో కలిసి వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ను విజయవంతంగా నిర్వహించడంలో కలెక్టర్‌లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ సిబ్బంది పోషించిన పాత్రను అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపద్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు మంచి పురోగతి సాధించారని, దాదాపు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అమ్మ ఆదర్శ కమిటీని ఏర్పాటు చేసి కనీస మౌలిక వసతుల పనులు గ్రౌండ్ చేయడం జరిగిందని సీఎస్ తెలిపారు.
అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన కనీస మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని, పాఠశాలలను పున ప్రారంభించేందుకు మనకు మరో 20 రోజుల గడువు మాత్రమే ఉందని, ఆ లోగా మంజూరు చేసిన అభివృద్ధి పనులను తప్పనిసరిగా పూర్తి చేసి పాఠశాలను ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బాలికల విద్యార్థులకు సంఖ్య ప్రకారం తప్పనిసరిగా ప్రత్యేకంగా టాయిలెట్లు ఉండాలని, వీటిని అత్యంత ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల పెయింటింగ్ వేయాలని, ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన చోట పెయింటింగ్ పనులు సైతం చేపట్టాలని, మంజూరు చేసి ఇప్పటివరకు గ్రౌండ్ కాని పనులు త్వరితగతిన గ్రౌండ్ చేయాలని సీఎస్ సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల స్కూలు యూని ఫామ్ జిల్లాలకు చేరుతున్నాయని, ఇప్పటి వరకు 17 జిల్లాలకు బట్ట చేరిందని, మరో 3 రోజులలో మిగిలిన జిల్లాలకు యూనిఫామ్ బట్ట చేరుతుందని సిఎస్ తెలిపారు. జిల్లాలో కుట్టు మిషన్లలో అనుభవం కలిగిన గుర్తించిన స్వశక్తి మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫాంలో కుట్టే ఆర్డర్ అందించాలని సి ఎస్. కలెక్టర్లకు సూచించారు. పాఠశాలలు పున ప్రారంభానికి ముందే విద్యార్థులందరికీ తప్పనిసరిగా యూనిఫారంలు సన్నద్దమయ్యేలా రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని సీఎస్ సూచించారు.
ధరణి పెండిరగ్ దరఖాస్తుల పరిష్కారం లక్ష్యంగా మార్చి 15 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లక్షా 15 వేల దరఖాస్తులను పరిష్కరించామని, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసినందున మరోసారి ధరణి దరఖాస్తుల ప్రత్యేక డ్రైవ్ పునః: ప్రారంభించాలని, మే చివరి నాటికి ధరణి పెండిరగ్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, ధరణి దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు రెగ్యులర్ గా తహసిల్దారులతో సమావేశం నిర్వహించి గ్రామాల వారీగా పెండిరగ్ సమస్యలను పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
పెండిరగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన మార్పులు ధరణి మాడ్యుల్స్‌లలో చేయడం జరిగిందని సీఎస్ తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులలో అధికంగా రెవెన్యూ, ధరణి సంబంధిత సమస్యలు అధికంగా వస్తున్నాయని, వీటి ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని అన్నారు.
డిసెంబర్ 8న ప్రజావాణి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించామని, ఎన్నికల నేపథ్యంలో జూన్ 07 వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేశామని, ప్రజావాణి కార్యక్రమం పునః ప్రారంభానికి ముందే పెండిరగ్ ప్రజావాణి దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సీఎస్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఉన్నప్పటికీ రికార్డు సమయంలో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేయాల్సి ఉందని, వీటిని సత్వరమే కొనుగోలు చేయాలని అన్నారు. 5 రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు.
రైతులకు ఎట్టి పరిస్థితులలో నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభించామని, చివరి దశలో పెండిరగ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు పురోగతి అంశాలను ఎప్పటికప్పుడు ప్రచారం చేయాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేశామని, వీటిని త్వరితగతిన కొనుగోలు దారులకు అప్పగించాలని, గోడౌన్ల నుంచి త్వరితగతిన ధాన్యం తరలింపు పూర్తి కావాలని సీఎస్ సూచించారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి మల్లికార్జున బాబు, ఇంచార్జ్ పౌర సరఫరాల శాఖ మేనేజర్ నిత్యానందం, డీఈఓ రాజు, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.