కామారెడ్డి, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా సేకరించిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో, ఆరెపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఎలారెడ్డిలో బాయిల్డ్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. రైస్ మిల్లులలో గత యాసంగి, వానాకాలానికి సంబందించిన ధాన్యం నిలువలు ఉండడం, స్థలాభావం వల్ల ప్రస్తుత యాసంగి ధాన్యం అన్ లోడ్ చేసుకోవడంలో కాస్త ఆలస్యమవుతున్నదని అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మిల్లులలో స్థలాన్ని సర్దుబాటు చేసుకొని త్వరితగతిన ధాన్యం అన్‌లోడ్ చేసుకొని వంద శాతం అకనాలెడ్జ్మెంట్ ఇస్తూ కొనుగోలు కేంద్రాలకు ట్రక్ షీట్ జారీ చేయాలని, తద్వారా సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమచేసే అవకాశాముంటుందని అన్నారు.
మిల్లుల వద్ద లారీలు వేచి ఉండరాదని, ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకుంటూ కొనుగోలు కేంద్రాలకు త్రిప్పి పంపాలన్నారు. నాన్-ఎఫ్.ఆర్.కె. బియ్యాన్ని భారత ఆహార సంస్థకు త్వరగా డెలివరీ చేయాలనీ మిల్లర్లను ఆదేశించారు. అకాల వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉంటూ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని, ధాన్యపు కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఉంచేలా రైతులకు అవగాహన కలిగించాలన్నారు.
కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని, బ్యాగులు సిద్ధం చేసిన వెంటనే లారీలను తెప్పించుకొని లోడిరగ్ చేసి పంపాలని, తాత్పర్యం చేయరాదని హెచ్చరించారు. ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించుటకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే పది రోజులు కీలకమని అధికారులు బాధ్యాతయుతంగా పనిచేయాలని కోరారు.
ఇప్పటి వరకు జిల్లాలో 44,845 మంది రైతుల నుండి 550 కోట్ల విలువ గల రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 490 కోట్లు రైతుల ఖాతాలో జమచేశామని, 97 శాతం టాబ్ ఎంట్రీ కూడా పూర్తయిందని, త్వరలో మిగతా రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్ధార్లు, డిప్యూటీ తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.