కామారెడ్డి, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని జిల్లా పౌర సరఫరా అధికారి మల్లికార్జున్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైస్ మిల్లులలో గత యాసంగి, వానాకాలానికి సంబందించిన ధాన్యం నిలువలు ఉండడం, స్థలాభావం వల్ల ప్రస్తుత యాసంగి ధాన్యం అన్ లోడ్ చేసుకోవడంలో కాస్త ఆలస్యమవుతున్నదని అన్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మిల్లులలో స్థలాన్ని సర్దుబాటు చేసుకొని త్వరితగతిన అన్‌లోడ్ చేసుకొని లారీలను త్రిప్పి పంపవలసినదిగా రైస్ మిల్లర్లను ఆదేశించామన్నారు. అదేవిధంగా ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించుటకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా నిజాంసాగర్ మండలం కోమలంచలో ధాన్యం సేకరణ మెల్లగా జరుగుతున్నదని రైతులు ధర్నాకు దిగగా వారికి సమస్యను వివరించి వెంటనే కేంద్రానికి లారీలు పంపి అక్కడి నుండి సమీప రైస్ మిల్లుకు ధాన్యం తరలించామని, రైతులు కూడా ధర్నా ను విరమించారని ఆయన తెలిపారు.
కొనుగోలు కేంద్రాలకు అవసరమైన లారీలను వెంటవెంటనే సమకూర్చవలసినదిగా ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ ను ఆదేశించామని, కేంద్రం నిర్వహకులు కూడా ధాన్యం తూకం వేసిన వెంటనే ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించాలని ఆదేశించారు.