కామారెడ్డి, మే 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు, జూన్ 3 నుండి 13 వరకు నిర్వహించనున్న పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత విభాగాలతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 24 నుండి జూన్ 3 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాన్నం 12.00 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాన్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని అన్నారు. ఇట్టి సప్లమెంటరీ పరీక్షలకు 10,511 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందులో మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 6,236 కాగా ద్వితీయ సంవత్సరంలో 4,275 మంది విద్యార్థులున్నారని అన్నారు.
ఇందుకోసం జిల్లాలో 29 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించామన్నారు. మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టుటకు 2 ఫ్లైయింగ్ స్క్వాడ్, 2 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.
అదేవిధంగా జూన్ 3 నుండి 13 వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు జరుగు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 869 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఇందుకోసం కామారెడ్డి, బాన్సువాడ మండల కేంద్రాలలో ఒక్కో కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. రెండు కేంద్రాలకు చీఫ్ సూపెరింటెండెంట్లను, డిపార్ట్మెంటల్ అధికారులను, రూట్ అధికారిని, కస్టోడియన్లను, ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, మెడికల్ కిట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లతో ఏ.యెన్.ఎం లను అందుబాటులో ఉంచాలని, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలు చేరుకునేలా వివిధ రూట్లలో ఉదయం వేళలో బస్సులు నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్‌కు సూచించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలని రెవెన్యూ అధికారులను, ప్రతి కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పొలిసు అధికారులకు సూచించారు.
పరీక్షా కేంద్రాలకు చరవాణిలు అనుమతి లేదని, ఒక్క నిముషం ఆలస్యమైన పరీక్ష హాలుకు అనుమతించబడదని విద్యార్థులు ఈ విషయాలను గమనించి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, సభ్యులు శ్రీనాథ్, నాగేశ్వరయ్య, డీఈఓ రాజు, ఇంచార్జి జిల వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర, కలెక్టరేట్ సూపరింటెండెంట్ జ్యోతి, విద్యుత్ శాఖ అధికారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.