కామారెడ్డి, మే 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 24 లోగా పూర్తి చేయవలసినదిగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేకాధికారి డా. శరత్ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ల పై సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, పౌర సరఫరాల అధికారులు, సహకార శాఖ అధికారులు, ఐకెపి, ఆర్డీఓలు, వ్యవసాయ శాఖాధికారులు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నారని, రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తున్నారని ప్రశంసిస్తూ ఇదే స్పూర్తితో అధికారులు సమన్వయంతో శుక్రవారం లోగా కొనుగోళ్ళ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసి కేంద్రాలను మూసివేసిన 180 కేంద్రాల సిబ్బందిని, హమాలీలలను, తూకం యంత్రాలను వడ్లు ఎక్కువగా ఉన్న కేంద్రాలకు తరలించి త్వరితగతిన మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తరలింపులో కాస్త ఇబ్బందులెదురైనా ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉన్నందున రోజు 10 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం తరలించుటకు నేటి నుండి కొనుగోలు కేంద్రాలు పగలు, రాత్రి పనిచేసేలా చక్కటి కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు.
తహసీల్ధార్లు, వ్యవసాయాధికారులు, ఎపిఎం లు భాద్యత తీసుకొని కేంద్రాలను సందర్శించి కేంద్ర నిర్వహకలు వచ్చే నాలుగు రోజులల్లో పూర్తి ధాన్యం సేకరించేలా చూడాలన్నారు. మిల్లర్లను నుండి ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని, సమయానుకూలంగా కేంద్రాలకు లారీలు సమకూర్చేలా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమన్వయము చేసుకుంటూ కేంద్రాలలో, మిల్లులలో సకాలంలో లోడిరగ్, అన్ -లోడిరగ్ జరిగేలా మానిటరింగ్ అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 97 శాతం ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి డబ్బులు చెల్లించామని ప్రత్యేకాధికారికి తెలిపారు. కాగా ఇందులో 230 కేంద్రాలలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేశామని, అక్కడి హమాలీలలను, తూకం కొలిచే యంత్రాలను వడ్లు ఎక్కువగా ఉన్న కేంద్రాలకు తరలించి ప్రతి రోజు కొన్ని కేంద్రాల చొప్పున మిగిలిన 120 కేంద్రాలలో శుక్రవారం నాటికీ పూర్తిగా కొనుగోలు చేసే విధంగా రోజువారీ కార్యాచరణ రూపొందించి అధికారులతో మానిటరింగ్ చేస్తున్నామన్నారు.
అన్నిబాయిల్డ్ రైస్ మిల్లులలో స్టోరేజి ఎంత ఉందొ చూస్తూ మిల్లుల సామర్థ్యము మేరకు ధాన్యం తరలిస్తున్నామన్నారు. కాగా అడ్లూర్, తలమడలో పంట కోతలు నడుస్తున్నాయని ఇంకా 760 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని వ్యవసాయాధికారులు తెలిపారని, అట్టి ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి రోజు కేంద్రం వారీగా ఎన్ని ధాన్యం కుప్పలు ఉన్నాయో మానిటరింగ్ చేస్తూ సింగిల్ డిజిట్ లారీలు అవసరమున్న త్వరగా ధాన్యం తరలించి మిగతా కేంద్రాలకు రోజు 10,12 లారీల చొప్పున పంపుతూ వచ్చే నాలుగు రోజులలో ధాన్యం సేకరణ పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పారు.
టెలీకాన్ఫరెన్స్‌లో డీఎస్ ఓ మల్లికార్జున్ బాబు, ఇంచార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం, వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, సహకార శాఖ అధికారులు ప్రశాంత్ రెడ్డి, భూమయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, ఆర్డీఓలు, తహసీల్ధార్లు, వ్యవసాయాధికారులు, ఐకెపి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.