కామారెడ్డి, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో మిగిలిన 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నాలుగు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయవలసినదిగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరెట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, జిల్లా పౌరసరఫరాలు, సహకార శాఖ, మార్కెటింగ్, రవాణ, వ్యవసాయ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్ల వేగవంతపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2.65 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇందుకు సహకరించిన మిల్లర్లను ప్రశంసిస్తూ ఇంకా మిగిలిన 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు సహకరించాలని రైస్ మిల్లర్లను కోరారు. వాతావరణం పొడిగా ఉన్నందున రాబోయే నాలుగు రోజులలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయటకు ప్రతి కేంద్రానికి ప్రత్యేకాధికారులను నియమించి తహసీల్ధార్, వ్యవసాయాధికారులు బాద్యులను చేస్తూ మానిటరింగ్ చేయాలన్నారు.
ప్రణాళిక ప్రకారం రోజు వారి లక్ష్యం నిర్దేశించుకొని కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు, మిల్లర్లతో సమన్వయము చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సహకార, ఐకెపి అధికారులు రోజు కేంద్రాలను సందర్శించి ధాన్యం తూకం వేసిన నాలుగు గంటల్లో లోడిరగ్ చేసి లారీల ద్వారా మిల్లులలకు తరలించి అక్కడ మరో 5 గంటల్లో అన్ లోడిరగ్ అయ్యే విధంగా పర్యవేక్షించాలన్నారు.
సకాలంలో లారీలు అందుబాటులో లేకపోతె రోడ్డుపై వెళ్లే లారీలను, ట్రాక్టర్లను అపి లోడిరగ్ చేసి పంపాలని సూచించారు. నాలుగు రోజుల్లో కొనుగోలు పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోళ్ల విషయంలో అధికారులు, రైస్ మిల్లుల యజమానులు సమన్వయంతో పనిచేసి వంద శాతం కొనుగోలు పూర్తి చేయాలని చెప్పారు.
అంతకుముందు బిక్నూర్ మండలం అంతంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో ముఖాముఖీ అయ్యారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయవలసినదిగా కేంద్రం నిర్వాహకులకు సూచించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ రాజంపేట, బీబీపేట్, సదాశివనగర్, బిక్కనూర్ మండలాలలో ధాన్యం కుప్పలున్నాయని, ప్రతి రోజు 9 వేల మెట్రిక్ టన్నుల మేర వచ్చే నాలుగు రోజులలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా తహసీల్ధార్లు, వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇంచార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం, డిసిఓ రమ్య, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా రవణాధికారి శ్రీనివాస్ రెడ్డి, సహకార శాఖ అధికారులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.