కామారెడ్డి, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, మిగిలిన ధాన్యాన్ని శనివారం లోపు అన్ -లోడిరగ్ చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి సమీక్షిస్తూ జిల్లాలో 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని అన్నారు.
ఇంకా 30,137 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే మిగిలి ఉందని అన్నారు. మిల్లుల సామర్ధ్యం ఎంత, ఎంత ధాన్యం దించుకున్నారో రాష్ట్ర స్థాయి విజిలెన్సు బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నామని, వారికి అవకాశం ఇవ్వకుండా త్వరితగతిన అట్టి ధాన్యం దించుకోవాలని రైస్ మిల్లర్లను కోరారు. తహసీల్ధార్లు, వ్యయసాధికారులు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులను సమన్వయము చేసుకుంటూ లారీలలో ధాన్యం లోడిరగ్ చేసి పంపుతారని, మిల్లులలో స్థలాభావం ఉంటె గోదాముల సర్దుబాటు అవకాశం ఉన్న దగ్గర ధాన్యం అన్ లోడ్ చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు.
లక్ష్యం మేరకు ధాన్యం అన్ లోడ్ చేసుకున్న మిల్లులకే వచ్చే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయిస్తామని, ఇది గుర్తెరిగి త్వరితగతిన ధాన్యందించుకోవాలని, జిల్లాకు చెడ్డ పేరు తీసుకురావద్దని అన్నారు, బాన్సువాడ డివిజన్‌లోని కోమలంచ, అచ్చంపేట తదితర ప్రాంతాలలో 5,700 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, డివిజన్‌లోని 11 రైస్ మిల్లర్లు 500 మెట్రిక్ టన్నుల చొప్పున శనివారం వరకు ధాన్యం దించుకోవాలన్నారు.
రైతులు కూడా నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా ధాన్యం తేవాలని కోరారు. వాతావరణం పొడిగా ఉన్నందున కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని వెంటనే తూకంవేసి ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.