కామారెడ్డి, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నేటి నుండి మూడు రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మిల్లర్లు త్వరితగతిన ధాన్యం దించుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఆదేశించారు. గురువారం బిక్నూర్ మండలంలోని బస్వాపూర్, కంచర్ల, బిబిపేటలోని ఇస్సానగర్ లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే లోడిరగ్ చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
తక్కువ ధాన్యం రాసి కుప్పలు ఉన్న కేంద్రాలు వెంటనే తూకం వేసి కేంద్రాలను క్లోజ్ చేయాలన్నారు. రైస్ మిల్లర్లు కూడా అన్లోడ్ పాయింట్లు అదనంగా పెట్టుకొని ధాన్యం దించుకోవాలని సూచించారు. ఈ మూడు రోజులలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని అన్నారు.
కాగా డీఎస్‌ఓ మల్లికార్జున బాబు, ఇంచార్జ్ జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తాసిల్దారులు కూడా విస్తృతంగా మిల్లులను కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారని ఆయన తెలిపారు. గురువారం బిక్నూర్, మాచారెడ్డి, సదాశివ నగర్ మండలాలలోని పలు రైస్ మిల్లలను సందర్శించి ధాన్యం త్వరగా దించుకొనుటకు పలు సూచనలు చేశారని చంద్రమోహన్ తెలిపారు.
మూడు రోజులపాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున అన్లోడిరగ్ వేగవంతం చేయాలన్నారు. గురువారం 208 లారీలను సమకూర్చి కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు ధాన్యం తరలించామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 350 కేంద్రాలకు గాను 263 కేంద్రాలలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేశామని ఆయన చెప్పారు. 48, 731 మంది రైతుల నుండి 2.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 551 కోట్లు జమ చేశామని చంద్రమోహన్ చెప్పారు.